25, డిసెంబర్ 2013, బుధవారం

                                      1 . చామర్తి గేయాలు,వచనాలు (1 to 13)
                                   గీత సారం                 ఆగష్టు 87                                                   ఏటి ఒడ్డున నీటి పూలు
ఎవరి కోసం పూయునో !
ఆకశాన వెండి మబ్బులు
ఎంత దూరం సాగునో!                 ll ఏటి ll

ఎదురు చూడదు చందమామ

వెన్నెలారగ బోయను
ఎదురు చూడదు కడలి కెరటం
దూర తీరం తాకను                      ll ఏటి ll

ఫలితమించుక ఎదురు చూడక

కర్మ చేయుటె గీత సారం
ఆ  సార మెరిగి నడచుకొనుటే
సర్వ జనులకు మంగళం                ll ఏటి ll 

                                        2  మన దేశం       ఏప్రిల్ 2004

యువతంటే  భవితం

భవితంటే భారతం
భారతం అంటే నీదేశం
పేరెన్నిక గన్న దేశం             ll భవితంటే ll

ఆర్ధిక మాంద్యంలో

ఆధిక్యం చాటుకుంది
పగబట్టిన టెర్రరిజాన్ని
పెకలించి వేసింది                 ll భారతం ll

ప్రపంచమంతా ఓ  గ్రామం

తావేలేదు ప్రపంచ సంగ్రామం
విశ్వనేత(ల) ఆధిపత్యం
అంతరించి పోతుంది            ll యువతంటే ll

ఎల్లలన్నీ  చెరిగిపోయి

 ఖండాలన్నీ కలిసిపోయి
నీధాటికి ఒక్కటై ,నీదేశం
 కేంద్ర బిందువై పోతుంది      ll భవితంటే ll           

నాయకులూ !నిద్రలెండి

నిజంతెల్సి మసులుకోండి
స్వార్ధం విడనాడండి
భారతాన్ని నిలపండి

భారతం నీదేశం

పేరెన్నిక  గన్నదేశం   +                   3.మనిషీ !వనరుల  ఒరవడీ !       08-01-2011

ఉత్పత్తి  శక్తుల్లో  మహాశక్తి  మనిషి 
సంపదల సృజనామూర్తి  మనిషి 
వృత్తి నైపుణ్యంలో  నేర్పుంది 
కళాత్మకా ప్రవృత్తిలో  ఓర్పుంది 

నైతిక స్ఫూర్తి ఉంది అతడిలో 

సాహసికత ఉంది అతనిలో 
పనివంటి వస్తువు లేదనీ 
పనిలోనే పూజ ఉందనీ 
విశ్వసించిన విశ్వరూపం 
వినీల గగనాల కెగసిన 
విశ్వ జ్ఞానం 
శాస్త్ర జ్ఞానం 
గగనమెత్తు 
అతడు గగనమెత్తు !

మనిషి నిలువెల్లా మేధస్సే 

మనిషి శరీర మెల్ల యశస్సే
మనిషి  ఓ విలక్షణం 
మరకు  లేని విచక్షణం

అందుకే _

మనిషీ !ఓ మనిషీ !
నువ్వు వనరులకే ఒరవడి !

+                                    4.  అందరిది  - మనందరిదీ     7,జనవరి ,2011

జాబిలి కోసమా?
జాతి  కోసమా ?
వెన్నెలా ? ఓ వెన్నెలా !

మబ్బుల కోసమా ?

మనుషుల కోసమా?
వానా ?ఓ వానా !

గగనం కోసమా ?

గమనం కోసమా ?
గాలీ  !ఓ గాలీ !                 ll జాబిలి ll

ఏదీ  నీ సొంతానికి  కాదనీ 

ప్రకృతి  జగతికి  సంకేతం 
పంచే  గుణమే లేకుంటే 
ప్రపంచమే కాదా శూన్యం ?
ఏదీ  నీ  సొంతానికి కాదని 
ప్రకృతి జగతికి సంకేతం 

పరోపకార  మిదం శరీరం 

పరోపకారమే  లోక కళ్యాణం 
పరపీడనమే  ప్రగతికి అంతం 
పరపీడనమే  ప్రళయం -ప్రళయం    ll ఏది నీ ll 

అన్యాయం ఎదిరిస్తేనే చైతన్యం 

దోపిడీ వల్లనే తిరోగమనం 
దోపిడీ ఆపితేనే పురోగమనం 
దిద్దు బాటే తిరుగు లేని  బాట 
తిరుగు బాటే దీ టైన  బాట 

అన్యాయం ఎదిరిస్తేనే  చైతన్యం 

దోపిడీ ఛేదిస్తేనే  పురోగమనం 

@                                               5.రజనీ గంధా      8 నవంబర్ ,2010

తరుణులు మెచ్చే రజని గంధా 
మరట్టులు మెచ్చే నిషీ గంధా 
టాబూలు మెచ్చే ట్యూబు రోజా 
మనమగువలు మెచ్చే లిల్లీగా               ll తరుణులు ll 

రమణులు రసరమ్యలు 

రమణులు రసరాణులు 
వాసనల సుగంధ రాజములు 
వాసికెక్కిన సువాసనా గంధములు 
రజని గంధాలు -నిషీ  గంధాలు  
వెదజల్లే వాసనల లిల్లీలు 
అత్తరువుకే  చిరునామాలు                 ll తరుణులు ll 

హుషారుకి మజిలీలు 

ధారులు ,క్రియాశూరులు  
ప్రాపంచిక సుఖ రూపులు 
వర్తమాన విహంగులు 
ప్రేమికులు -లిల్లీ ప్రేమికులు 
రమణులు -రస రమ్యలు 
రమణులు-రసరాణులు   

తొలి ప్రేమకు సంకేతం 

వధూ కన్యకే సంతకం 
రమణుల చిత్తహారిణి 
రసరాణుల మనోహారిణి                            ll తరుణులు ll                                

రస రజని గంధా 

టాబూల ట్యూబు రోజా 
మన మగువల లిల్లీ రోజా                          ll తరుణులు ll  
                                                    
   +                                        6.   కాకోపనిషత్తు        2,నవంబరు ,2010

నేనేకాకినని  

కాకితో మొరపెట్టుకున్నా  
నువ్వ్వే కాకివని
నన్నా కాకి ప్రశ్నించింది

కాకులెన్నిరకాలని

నే యెదురు ప్రశ్నవేశాను ?
అందుకా కాకి నవ్వింది
మీ మనుషులే మాకెన్నో
పేర్లు పెట్టారని 
నిట్టూర్చింది 

మా కుల గురువు 

చాణక్యుడంది 
మమ్మల్ని చూసి
మీరు నాల్గు నీతుల్ని 
నేర్చుకోవాలంది 
నిర్దేశించాడంది 

ఒకటి -

మేం సాముహిక జీవులం 
సమిష్టి విహంగాలం  

రెండు -

మాకు దొరికిన ఆహారాన్ని 
అరిచి,ఆహ్వానించి పంచుకు తింటాం 

మూడు -

మేం శోకాన్ని కూడా 
అందరిని పిలిచి,విలపించి 
సాముహిక శోక ,సంతాపాల్ని  
వెలిబుచ్చుతాం 

నాలుగు -

మాకు,మీలా కుల ,మత భేదాల్లేవంది
మాలో ,తెలుపూ -నలుపూ 
రెండే జాతులంది 

తెల్లని గుడ్లని పొదుగుతాం 

నల్లని స్వఛమైన  పిల్లల్నిచేస్తాం 

కాకి కోకిలౌతుందాని 

మీలోకులు ప్రశ్నిస్తారు 
మేం పొదిగితేనే 
కిల -కిల ,కుహు-కుహూ 
కోకిల్లవుతాయ్ !
మనిషీ ! ఓ పాపీ !
మేంచిరాయువులం ఎందుకంటే 
మాకు సహజ మరణం లేదు 
  
 +                                              7. ప్రజాఘోష            08-10-2010

చినుకు కాదిది కడలి చివరికి 

వేళ్ళు కావివి బిగిసి పిడికిలి 
ఓట్లు కావివి ప్రజల హక్కులు 
జేజేలు కావివి జనుల ఘోషలు           :చినుకు:

అణచి వేతకు గురియై

కూడు-గూడు కారవై 
పనులు, పాటుకు దూరమై;
ప్రజాధనం మాయమై పోతుంటే -
సహనముండదు 
చట్టముండదు 
మిమ్మాలకించె స్థానముండదు 
ప్రజల సయం అస్సలుండదు 
ప్రజాస్వామ్యం నీడ ఇవ్వదు                    :చినుకు:

ప్రజా ప్రతినిధి ఎవడురా?

పేరోలగాన పెద్ద ఎవ్వడురా?
గద్దె నెక్కి-మిద్దె కట్టి 
స్విస్సు బ్యాంకుల సొమ్ము బెట్టి 
స్కీములెల్లా స్కాముల్జేసిన   
మీరా? ప్రజా ప్రతినిధులూ ?                       :చినుకు:

ఇది ఓటు చేసిన చేటనీ 

ఇది ఓటు వేసిన కాటనీ
ఒటు  కింక చోటే లేదనీ 
పోటెక్కిన ప్రజా పోరై 
పిక్కటిల్లే పాంచజన్యం 
యుద్ధభేరి మ్రోగిస్తుంది 
మీ ఆగడాలు కూల్చి వేస్తుంది 
ప్రతి ఫలాల్ పంచి ఇస్తుంది                           :చినుకు:

                                        8. ఆలోచించేరా?

                                                                                   09-10 -2010
ఇది గాంధీ పుట్టిన దేశం
ఇది నెహ్రూ ఏలిన దేశం 
ఇది బోసు స్ఫూర్తి నింపిన దేశం 
ఇది శాస్త్రీజీ సుస్థిరపరచిన దేశం                :ఇది:

స్వాతంత్రం వచ్చి ఇన్నేల్లైనా 

సామాన్యుడికి ఒరిగిందేoటని?
ఆలోచిoచారా?
మీలో ఎవరైనా?                                      :ఇది:

పరులు దోచుకున్న నాడు 

నిరాకరించి, నిరసించి 
ఉద్యమాల్జేసిన 
మీ తాతల ముత్తాతల 
వారసులెనా మీరు?                                  :ఇది:

ఆలోచిoచారా?

మీలో ఎవరైనా?
నేటి భారతం చూసేరా?
కళ్ళు తెరిచి చూసారా?
భవితవ్యం భాగోతం 
మన వాళ్ళే దోచుకుని
దాచుకుంటుంటే 
తమాషా చూస్తున్నారా?
                                                               :ఆలోచిoచారా:
ఆ అమర వీరుల 
వారసులేనా మీరు ?
భద్ర మేనా మీ భవితవ్యాలు? 
సాలోచన చెయ్యండి 
సమిధలు సిద్ధం చెయ్యండి 
సమర గీతికలు పాడండి 
మళ్ళీ సమరం చెయ్యండి 
సుస్వరాజ్య సమరం నెరపండి                     :ఆలోచిoచారా:

వినాయకులేదో  చేస్తారని 

ఏదోపార్టీ చేస్తుందని 
ఎన్నాళ్ళీ నిరీక్షణ?
ఈ నిర్లిప్త వీక్షణ?
నిటలాక్షులై కదలండోయ్ 
కదం తొక్కి, కదం కలిపి 
శ్రీ గణేశు పాడండోయ్                                : ఆలోచిoచారా:

అరవైఆరేళ్ళ కొలమానం 

భారత మాతకే అవమానం 
లేవండోయ్! లేవండి!
రొమ్ములొడ్డి పోరాడండి 
ప్రతి ఒక్కడు నాయకుడై 
ప్రతిఘటించండోయ్
ప్రతి ఒక్కడు సైనికుడై 
నరుక్కురండోయ్!
అప్పుడే వచ్చేనోయ్ 
అసలు- సిసలు 
స్వచ్ఛమైన - మచ్చలేని 
నిజమైన, నిర్వాకమైన 
ప్రజాస్వామ్యం!

ఆలోచించారా?

మీలో ఎవరైనా?
ఆలొకించెరా?
మీలో ఎవరైనా?                                  :ఇది:


@                          9. అను 'మత్తు'చాలీసా               10,అక్టోబరు 2010

                రాజులే పొయ్యేరు! రాజ్యాలు పొయ్యాయ్!

 గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఖరుసై పొయ్యేరు. నిఖార్సైన
నీతిపరులు సోదిలోకి లేకుండా పొయ్యారు. నీతి,నియమాలు 

నీ్ళ్ళు* అయిపోయినాయ్ . బలాత్కారాలు , మానభంగాలు 
 పెరిగిపొయినయ్ .కట్నాల వేధింపులు,ఆడపడుచుల
 ఆత్మహత్యలు ,లంచాలు,నేరాలు-ఘోరాలు
పెచ్చు  పెరిగిపోనాయ్! శోధించి , పరిశోధించి ఈటన్నిoటికీ 

'రీజనింగు ' ఒక్కటేనని నిర్ధారణ కోచ్చేసేను.ఇదేదో ,
మీకేమో చిన్న విషయంలా కాపడద్ది . కాని ,ఇది పేద్ద జాడ్యం .

సూది మందు లేని అతి పెద్ద జాడ్యం. రోగం
పోవాలంటే "మందు"డోసు పుచ్చుకోవాల ! మరీ జాడ్యం 

పోవాలంటె మందుని మందుగా పుచ్చు కోవాల!అప్పుడే
తాగుబోతులుండరు.  సమాజంలో కస్మలం ఉండదు.
 మీకు మాటలు అర్ధం కావు. అందుకే "అను'మత్తు'చాలీసా" 

పాటయేత్తాను . పాడుకొండెహే !  దరువేసుకోరా!సూత్తా ఉండి 
పోతావేరా? ఊగుతా వాయించకు !తాగుబోతనుకునేరు !!!     

పల్లవి : 


ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు 

ఒంటికి రెండే పెగ్గులు హద్దు 
మత్తుకు చిత్తయి పోవద్దు 
చేయరా! మత్తును చిత్తు                   :ఇంటికి:

మత్తుకు  బానిసలై

ఆపై సోమరిపోతులై 
ఆలోచనా హీనులై 
దారులు తప్పి 
రహదారులు తప్పి 
గమ్యహీనులై పోతారు
ఆస్తులు,పుస్తులు హరీ! హరీ !
పరువు ప్రతిష్టలు సరే! సరి!
మత్తుకు చిత్తై  పొవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా !            :ఇంటికి:

జనని జనకులు శోకతప్తులై 

పిల్లా పాపలు పస్తుల పాలై 
నారీమణులు ఆకలి పాలై 
పోతుంటే ........ 

తాగుబోతులార !

తాగేదేంటో తెలుసుకోండిరా !
సారా కాదురా,అది సార కాదురా!
సార కాదని తెలుసుకోండిరా
కన్నకడుపుల రక్తంరా! 
మత్తుకుచిత్తై పోవద్దురా !
చెయ్ రా! మత్తును చిత్తుగా !                  :ఇంటికి :

శీలం పోతే పోనీ 

సౌశీల్యంగా మారొచ్చు 
మానం పోనీ,పోతే పోనీ
రోగం వచ్చి ఆరోగ్యం చెడితే ?
మరెక్కడికెళ్లినా
మందులేదురా 
అందుకే ;
మత్తుకు బానిస కాకురా 
"మహ "రాజులకే చెల్లనిదీ 
నువ్వో లెక్ఖా?
"ఇంచక్కా "వినుకోరా 
"మందుని","మందు"గ వాడరా 
బతికి నీవాళ్ళను
 బతకనివ్వరా! 

ఇంటికి ఇద్దరు పిల్లలు ముద్దు 

ఒంటికి రెండే పెగ్గులు హద్దు 
మత్తుకు  చిత్తై పోవద్దు 
చెయ్ రా మత్తును చిత్తు చిత్తు
                                                              
                                                                                                         10-10-2010
@                             10. మత్తు మనుగడకు చేటు                          

        
పల్లవి : 
తప్పటడుగులు "మొదటి"  పెగ్గులు
తప్పుడడుగులు "బానిస" పెదవులు
చట్టం "హెచ్చరిక" సీసాపై
పతనం పతనం ఆపై
ఆలకించరా! నిజం తెలియరా!
మనుగడకే పెను చేటురా                    :ఆలకించరా:
                             
 చరణం: 
తాగిన  తొందర మరణం
తాగిన రోజున నరకం
చచ్చాక నరకముండగా,
తెచ్చుకోకు బ్రతికుండగా
నిలబడి ఆలొకించరా
నూరేళ్ళు పండించరా                         :నిలబడి:

:చరణం:

పుట్టుక తొదివి సుఖ దుఃఖాలు
(తోడ బుట్టినవి సుఖ దుఃఖాలు)
(తోడ బుత్తువులు సుఖ దుఖాలు)
క్షణి కానన్దమ్ క్షమించని నేరం
అడుగెయ్యక ఆలోచించరా!
ఆలసించక ఆలోచించరా!                   :అడుగెయ్యక:

:చరణం:

ఆత్మ వంచన మహాపరాధం
నరజాతికే అది అవరోధం
ఆత్మా శోధన మహోపకారం
నిన్ను నువ్వే  నిల్వ రించరా
అది మానవాళికే నీరాజనం
 నిన్ను నువ్వే నిల్వ రించరా
నీకై నీవే తెలుసుకోరా                         :నిన్ను నువ్వే:
                                                                                             
:చరణం:
మనిషి చావకూడదు
మనుగడ ఆగ కూడదు
చిత్తుగా చెయ్యర మత్తును
నిషేధించరా మత్తును                         :తప్పటడుగులు: 

@                              11.హోళీ జెండా! ఎజెండా !        26-2-2010


సాకి :

అది మాసం ఫాల్గుణం 
తిధి పేరేమో పౌర్ణం 
కృష్ణుడు పెట్టే ముహూర్తం 
నాడే పూతన సంహారం 
ఆనందానికి సంకేతం 
మధురాప్రాంత ఉత్సవం
వసంతోత్సవం 
అదే , ఈ ఆనంద కేళీ 
రంగులపండుగ హోళీ
 

పల్లవి :
ఇదే ...... ఇదే ......ఆనంద  కేళీ 
రంగుల పండుగ హోళీ
చరణం : 

ప్రతి గల్లీ ఓ గోకులం 
లేదు మాకు వర్ణ భేదం 
"గులాల్ "కుండవు కులాలు 
ఇది ఆనంద "ఆర్ణవం"
వర్ణముల్లేని "పబ్బం "                         :ఇదే:

చరణం :

పుట్టుట,గిట్టుట,ప్రకృతి ఆట 
రెంటికి మధ్యన రంగుల ఆట 
ఒకటై వేద్దాం పువ్వుల బాట 
వినిపిద్దాం ప్రగతి "ఏజెండా "
ఎగరేద్దాం మన హోళీ" జెండా"               :ఇదే :



#            
                                     12.   ఎందుకు?

మనవరాలు:
నిజమే ఎందుకు చెప్పాలి?
నాయనమ్మ: 
చివరిదాకా నిలిచేదనీ,
“సత్యమేవ జయతి” అనీ,
నిజం అందుకు చెప్పాలి
సుఖముగ జీవించాలి
మనవరాలు:
ఎవరినీ నొప్పించకూడదు ఎందుకో?
నాయనమ్మ: 
దేనికికైతే నువ్ నొచ్చుకుందువో,
ఇతరులకెన్నడు చేయకనీ,
లోకఖ్యాతి (ఇది) ‘విదుర నీతి’యనీ,
బుద్ధమహాత్ముల బోధనలూ ఇంతేననీ,
ఎవ్వరినీ ‘నొప్పించకూడదు’ అందుకనీ
మనవరాలు: 
పొరుగు-ఇరుగులతో
కలిసి-మెలిసి ఎందుకు ఉండాలి?
నాయనమ్మ:
మంచీ చెడుల లోకమనీ,
“మానవతం” కష్టసుఖాలనీ,
మనం “మనుషులం” సంఘజీవులం-
ఒకరికి-ఒకరం
ఆసరాలేక జీవించలేమనీ
అందుకే-
పొరుగు-ఇరుగుతో
కలిసి-మెలిసి ఉండాలి             9th, సెప్టెంబర్ 2014

                                     13.  వెక్కిరించు ఓటమిని
పల్లవి:
వెక్కిరించు ఓటమిని
కుక్కిన పేనై పడి ఉంటుంది
కుదేలై పోయావో?
తలకెక్కి సవారీ చేస్తుంది                    :వెక్కి:
చరణం: 
గెలుపు గాడి తప్పిందంటే?
ఓటమి ఒళ్లోకి జారినట్టే!
నిరంతర యత్నమే
విజయానికి సంకేతం                       :గెలుపెప్పుడు:
చరణం: 
అలుపులేని సంయమనం
సలుపెరుగని సంధానం
పడిపోతున్నా లేచే తత్త్వంతో
మున్ముందుకు సాగాలి
ఆ గెలుపుకే అలుపొచ్చి
విజయం నీ సొంతం కావాలి
గెలుపెప్పుడు శాశ్వతమై నిలిచింది?
వైఫల్యం తిష్టవేసుక్కూర్చుందా?
నిరంతర యత్నమే
విజయ కేతనం                              :గెలుపెప్పుడు:          :వెక్కి:
చరణం: 
విజయం” నీకోవిషయం చెపుతుంది
నిన్ను లోకానికి పరిచయం చేస్తుంది  
“ఓటమి” నీకో పాఠం నేర్పుతుంది
నీకో ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది
విజయం వెనక రహస్యాలుండవ్
ఘోర వైఫల్యాలే ఉంటాయి
“వై ఫై వైఫల్యాలె” ఉంటాయి              :విజయం:                  :వెక్కి:
చరణం:
ఓటమంటే ఓ పాఠం!
గురువై గుర్తుకు చేస్తుంది
గెలుపంటే గుణపాఠం
ఆత్మకే ప్రబోధం
గెలుపు-ఓటములు
పడిలేచే కెరటాలు
విజయాలకు బావుటాలు
గెలుపెప్పుడు శాశ్వతమై నిలిచింది?
వైఫల్యం తిష్టవేసుక్కూర్చుందా?
నిరంతర యత్నమే విజయం
నిరంతర యత్నం విజయ కేతనం
వెక్కిరించు ఓటమిని
కుక్కిన పేనై పడి ఉంటుంది
కుదేలై పోయావో?
తలకెక్కి సవారీ చేస్తుంది.              10-10-2014  

1, డిసెంబర్ 2013, ఆదివారం

  +                                   చామర్తి గేయ శతకం -1  
                                      రచన : Lt . col .చామర్తి వేంకట లక్ష్మి నరసింహారావు 

                          ఆలుబిడ్డలు, తల్లితండ్రులు, కొడుకులు,కోడళ్ళు

1 ఆలి దొరకు నుదుటి వ్రాలుకు సరిగాను
కోరు కున్న రాదు కోమలాంగి
సోక్రటీసు కూడా సోకించే నాలితో
మహిని నీతి బాట మర్తి మాట

2.కొత్త కోడలనుచు కోరిన వంటలు
వండి పెట్టెనత్త వనరుగాను
జబ్బుపడగ నత్త బరువాయె నత్తిల్లు
మహిని నీతి బాట మర్తి మాట 
    
3.సుతులు లేక గతులు సున్నయనిరి నాడు
 నేటి సుతుల మాట నీటి మూట
చెనటి సుతుల తోడ చేరువౌ నరకంబు
 మహిని నీతి బాట మర్తి మాట

4.వేయి రూకలడుగు  పెంచిన కొడుకులన్
 మగడు చేయు ఖర్చు గణనకాదు
ముందు చెవుల కన్న వెన్క కొమ్ములవాడి
మహిని నీతి బాట మర్తి మాట

5.అమెరికాకు బోయు డాలర్లు  గడియించి
భూమి, భవనములను కూడ బెట్టి
మాత పితరుల పాట్లు మరతురు తనయులు
మహిని నీతి బాట మర్తి మాట                                                                           

6 తండ్రి కూడ బెట్ట తల్లి ముడుపు గట్టు
తనయులొచ్చి వారి తరిమిగొట్టు
సుతులు కంద్రుగని బుద్దుల కనలేరు
మహిని నీతి బాట మర్తి మాట

7 అమ్మ చేతి వంట యెవ్వరి కైనను
రుచిగ నుండు ననుట రూడి గాదె?
జిహ్వ కలవడు రుచి జీవితాంతము నిల్చు
మహిని నీతి బాట మర్తి మాట

8అమ్మ వంట తప్ప యాతార మెచ్చదు
జర్నలిస్తులడుగ జవాబులిచ్చు
బతక నేర్చి  బతుకంత బడాయి
మహిని నీటి బాట మర్తి మాట

9 పెండ్లి ముందు కొడుకు పెద్దగా పలికినా
తల్లి మరుగు బడును తరుణి రాగ
మబ్బు చాటు మామ మసగేసి పోడొకో
మహిని నీతి బాట మర్తి మాట

10 నుదుటి మీద జుట్టు నునుపైన  బుగ్గలు
పెదవి చూడ చాలు పెరుగు మోజు
పెదవి మీద నిల్చు పెనిమిటి బలమురా!
మహిని నీతి బాట మర్తి మాట

11 భూమి సుతుడు నరకు డుద్దీప్త సమర
రంగ మందు కూలె తల్లి చూచి
సవతి తల్లి ప్రేమ సంప్రాప్తమై తీరు
మహిని నీతి బాట మర్తి మాట

                                కుల, , మత,వర్ణ భేదములు

12 మతము లెన్ని యున్న ధర్మ మొక్కటి గాదె?
కులము లెన్ని యున్న గుణము లొకటి
మేని రంగులు వేరు మేని రక్త మొకటె!
మహిని నీతి బాట మర్తి మాట

13 హిందూ మతము నెంత హీనంబు చేసినా
వన్నె తగ్గి పరుల వశము గాదు
భూమి మీద నున్న "జీవన విధమిది"
మహిని నీతి బాట మర్తి మాట

14 యేసు సిక్కిసాయి ముస్లీము జైనము
బౌద్ధ వైష్ణవ హీబ్రు శైవ మతము
వీటి పుట్టక తెలుసు; విశదమే  హైన్దవంబు?
మహిని నీతి బాట మర్తి మాట

15 అంటరాని తనపు మంటల నార్పంగ
మంది, నీళ్ళ తోడ మంట బోదు
మనసు లోని మంట మనిషి యార్పుట బాడి
మహిని నీతి బాట మర్తి మాట

















16 పార్శ్వ మందు  నీకు పార్వతి చాలక
శిరసు నేల గంగ నీల కన్థ  
మింగ నేల విసము  గౌరికి సవతేల?
మహిని నీతి బాట మర్తి మాట

17 లోక మంత యొకటి లోకరీతి యొకటి
ప్రజల  మాన మొకటి ప్రాణ మొకటి
దేని కసలు భాష దేశమొక్కటి యైన
మహిని నీతి బాట మర్తి మాట

18 సాహితీ జగమొక సామ్రాజ్య ఖండంబు
కవుల కులము జగతి మండనంబు
కవుల లోన లేరు దళిత కవులు వేరు
మహిని నీతి బాట మర్తి మాట

19 కవికి పుట్టు కులము ఖచ్చితముగ రాదు                                        
"కవి" యనునదే కులము కవుల కెపుడు
కవులకు కులమీయ కవి కులముకు మచ్చ
మహిని నీతి బాట మర్తి మాట  
                                                       
20 కులము నొక్కవైపు దునుముచు తెగనాడి
దళిత కవులమనుట ధరణి తగునె?
పలుకులమ్మ నిట్లు పాడియా చేయుట?
మహిని నీతి బాట మర్తి మాట

21 దళిత కవులమంచు దళిత సాహిత్యమం
చిలను పదుగురనుట సిగ్గుగాదె?
కవనమునకు కలవెమతములు కులములు?
మహిని నీతి మాట మర్తి మాట.

22 లింగము మెడవేయ లింగ ధారులుగారు
పొందలేరు శివుని బొందితోడ
చిత్తశుద్ది   లేక శివుని పొందుట సున్న
మహిని నీతి బాట మర్తి మాట.

23.నుదుట బూది రాసి నూనెపై బొట్టుంచి
దొంగ భక్తి చూప దొరలు గారు
బొట్టు పెట్టువారే బ్రోకరులీనాడు
మహిని నీతి బాట మర్తి మాట.

24 తిరుపతిగిరి మీద తిరుగేటి సాముల
మూర్ఖమందు నుండు ముడొకటులు
భక్థజనమునెల్ల భక్తితో దోచగాన్
మహిని నీటి బాట మర్తి మాట


                                                              




















25.దేవతర్చానంబు దేవతా పూజలు
దేనికొరకు చేయుచున్నారు బుధులు ?
యోగసిద్ది కొరకు నోంకార సిద్ధికై
మహిని నీతి బాట మర్తి మాట

26.కులము మతములేదు పుడమికి, నీటికి
గాలి మనుషుల దాకి మసలు చుండు
పంచభూతములకు పట్టింపు లేదయా!
మహిని నీతి బాట మర్తి మాట.

27. అంబురంబు కప్పు వసుధ చక్కనియిల్లు
మంటి మర్థ్యులెల్ల భ్రాతృ  సములు 
ఖండమంద్రు దేశమందురు దేనికో ?
మహిని నీతి బాట మర్తి మాట

28.దీవులందు వంద శిశువుల పెంచుము
బాష,మతము లొక్కదేశప్రజగ
పిదప జగము చూప పిచ్చివారందురు
మహిని నీతి బాట మర్తి మాట.

29.తోటిపౌరులెల్ల తోడ పుట్టినవారు
మానవత్వముతోడమసలు కొనుడు
వోటులమ్ముటన్నతోటి వారి నమ్ముటే
మహిని నీతి బాట మర్తి మాట

30."కావు","కావు" మనును కాకము తెలుపైన
చానకోకిలట్లు పాడగలదె?
రంగుమారినంత రసశైలి మారునా?
మహిని నీతి బాట మర్తి మాట

31.అన్ని కులములందు వన్నెకెక్కిన వారు
పెక్కుమంది గలరు పుడమిలోన
గుణము గణనకాని కులములు కొలతయా?
మహిని నీతి బాట మార్తి మాట

32.కులములనుచు నిచట కూడరు సంఘమై
వర్ణభేదమంచు తగవులచట
వసుధనెందు చూడ వర్గంపు వైరమే!
మహిని నీతి బాట మర్తి మాట

33అపరి శుభ్రతలసలరయంగనొకపరి
దేనికసలు?చూడదేహమునకు;
మనసుకడుగలేని మజ్జన మేలనో?
మహిని నీతి బాట మర్తి మాట

34కులములెన్ని యున్న గుణముకు సరిగావు
గుణము లేని కులము గుడ్డికన్ను
వోటుకు కులమొచ్చి పోగాల మొచ్చెరా 
మహిని నీతి బాట మర్తి మాట

35 కాషాయములు  గట్ట కాలేరు యోగులు
లోని శత్రువులను తోలలేరు
మనసు కడిగిమనిన మనిషియే ఋషిరా
మహిని నీతి బాట మర్తి మాట

36.పూర్వయుగములందు పూసెను పెళ్ళిళ్ళు
అడపదడప యిపుడు జరుగు చుండె
కాదని యనరాదు కలియుగ ధర్మంబు
మహిని నీతి బాట మర్తి మాట

37.డబ్బులున్న వారి డాంబికముల ముందు
పేద తనమొక్కటే పెద్ద గోడ
గుణము,కులము కూడా కూలెను కుప్పగా
మహిని నీతి బాట మర్తి మాట

38.నోటుకంటులేదు నోటికి లేదంటు
కాసుకంటులేదు కనకమునకు
కులము,కులము కంటు కుటిలము కాదొకో !
మహిని నీతి బాట మర్తి మాట

39 అంటరానితనము నొంటరితనములు
లేవు సంఘమందు పూర్వ మందు
సృష్టి లోన లేవు సృజియిoప బడలేదు
మహిని నీతి బాట మర్తి మాట

40కులము లడ్డురావు కుందనములు గల్గ
జాతి మతము లేదు జారత్వమునకు
వీలుగాని చోట యీ కుల జాలమా?
మహిని నీతి బాట మర్తి మాట.

41.జాయచామరాజు వడయారు కుమ్మరి
గీతరాతగాడు గొల్లవాడు
కులపువృత్తు లెపుడో  కూలిన మేడలు
మహిని నీటి బాట మర్తి మాట 

42.భాగవతముకన్న భక్తితత్వము లేదు
భారతమ్మునిండభ్రాతృ  హత్య
వీటికన్నవేరె  ఇతిహాసములు లేవు
మహిని నీతి బాట మర్తి మాట

43.రాజునేల కోరగసేనవేన్కకు తగ్గు 
కవులు కనులు మోడ్చ కీర్తిహెచ్చు
ధరణినేలు రాజులు ధర్మగాములు కవులు
మహిని నీతి బాట మర్తి  మాట

44.రాలు కరగపాడె  రాగల నొకనాడు
గుండె లాగిపోవు  కూతలిపుడు
సగము చచ్చిపోయే  సంగీత లక్ష్మిరా 
మహిని నీతి బాట మర్తి మాట

45.వస్తుకాయచయము వసివాడిపోవును
వేడి వలన,గాలి, ధూళివలన
హిమగిరుల నుండ చిరకాల మాయువు
మహిని నీతి బాట మర్తి మాట

46.ఆయువున్నవరకు కాలయాపన జేయు
తలపడె ప్పుడు మదిని హరుని జాడ
"పుట్టువాడు-గిట్టు" బుద్ధిని యెరుగడో?
మహిని నీతి బాట మర్తి మాట

47.పాత నగల నిచ్చి  పసిడి కొత్తవి కొన్న
తరుగు పోవు పాత నగల మీద
అమ్మబోవనడివి కొనబోవ కొరివిరా
మహిని నీతి బాట మర్తి మాట

48.వర్షకాలమందు వనరులు లేనిచో
జీవనంబు చాల హీనమగును
వసతి ,సుఖము లేని వసుధయే  నరకంబు
మహిని నీతి బాట మార్తి మాట

49.ముందు వచనమిచ్చి  మురిపెంపు బిరుదంబు
వేగ తిప్పి  పంపె  కేంద్రబిరుదు 
తల్లికేమి లోటు! తనయులు కవులైన
మహిని నీతి బాట మార్తి మాట

50.తెలుగుపాటగాడు వేటూరి పాటకు
కావ్య గౌరవ మద్ది గణుతికెక్కె
తెనుగు చేసుకున్న పుణ్యంబదెంతయో!
మహిని నీతి బాట మార్తి మాట 

51.తెనుగు బాషకీని బిరుదము తనకెందు
కనేనో?మాతృబాష కందెననియో?
తనకు బిరుదునీయ తాకేల దోసెను
మహిని నీతి బాట మార్తి మాట

52. నగకు,నట్రకు నొక్క నవరత్నము పొదగ
నగకు నందమబ్బు నదరుగాను
మిట్టపల్లములున్న మేనిదే యందంబు
మహిని నీతి బాట మార్తి మాట

53.సాగర మధనమున సంభవించెను సుధ
జలధి జలములింక లవణమగును
ప్రక్రియ తీరుమార ప్రగతి సాధ్యముగాదె  ?
మహిని నీతి బాట మార్తి మాట
      
54.ఆటవెలది  తేటగీతులు పాడ
మేళకర్త యొకతి మేను నూపె
నాట్య కారుడంత యాత్మాహుతికి   బూనె!
మహిని నీతి బాట మార్తి మాట

55.ఆడు వెలది తేట గాత్రంబు పాడంగ
మేళ నాయకురాలు "డేన్సు "  జేసె
చింత చచ్చెగాని పులుపు చావగలేదు
మహిని నీతి బాట మార్తి మాట

56.ఆడువెలది తేట గానంబు సేయంగ
వేశ్య మాత తాను మేల మాడె
పోయే కంటి చూపు పోలేదు కామంబు
మహిని నీతి బాట మార్తి మాట

57.ఉన్న లోభి పట్టి యూరించి  ఫైకమున్
పొందవచ్చు భువిని బొంకియైన
లేని దాత నడుగ లాభంబు లేదయ్యా !
మహిని నీతి బాట మార్తి మాట

58.కూడబెట్టువాడు కాటికి గొంపోడు 
ఖర్చు పెట్టువాని ఖనన మడ్డె?
పంచి తినిన  వాడె పరమాత్ముడిలలోన
మహిని నీతి బాట మార్తి మాట

59.చుట్ట కాల్చువాడు సూర్యుని కొడుకంట
బీడి  కాల్చువాడు భీమసుతుడు
ఏమి కాల్చనోడే ఎత్తయిన  మనిషిరా
మహిని నీతి బాట మార్తి మాట

60.చేరి సైన్యమందు దేశమాతను గొల్చి
వీరగతిని పొందె వీరుడొకడు
ఊరి వారి  కాత   డుత్తిత్తి  మనిషిరా!
మహిని నీతి బాట మార్తి మాట 
  
61 వెన్నదొంగ యనుచు వేణులోలుడనుచు
వేయి పేర్లతోడ పాడుకొంద్రు
చిన్ననాటి పనులు  చిలిపిగనుండవా ?
మహిని నీతి బాట మార్తి మాట

62.ఎంత నేల యున్న నెన్ని యిండులు గట్ట
యొక్క యింటి లోనె  ఉండ గలడు
దేవదేవుడికైన    దేవళ మొక్కటే
మహిని నీతి బాట మార్తి మాట

63 మూడు కాలములను చూడగలరు వారు
సూక్ష్మదృష్టి తోడ ఋషులు వారు
కాన,కవుల నీతులు కల్లలు కావెన్నడు
మహిని నీతి బాట మార్తి మాట  

                                 నేటి యువతీ ,యువకులు-వేషభాషలు,

                              చదువులు-సంస్కారాలు 

64. కూడు గలిగెనేని గుడ్డకై మరలును
గుడ్డ కల్గె నేని  గూడు కొరకు
కోర్కె లిట్లు సాగు క్రోసుల దూరము
మహిని నీతి బాట మార్తి మాట

65.పిల్ల "సాఫ్టువేరు" పిలగాడు"హార్డ్వేరు"
లేపు  టాపు బేగ్గు ,లేని శక్తి
వేళా పాళ  లేని   వెరయిటీ"జాబులు"
మహిని నీతి బాట మర్తి మాట 

66ఇంగలీషు చదువు లీనాడు పరిపాటి
"మాటలాడు”భాష అసలు రాదు
తెలుగు రాకయిపుడు రెంటికీ  చెడిరయ 
మహిని నీతి బాట మర్తి మాట

67.విద్యలేనివాడు  వింత పశువనిరి
విద్య కలుగు పశువు వివరమేమి?
విద్య యున్నవాడు   విపరీత పశువురా
మహిని నీతి బాట మర్తి మాట

68విద్య వలన వచ్చు వినయమే వినయము
విద్య కున్నతావి వినయ మంద్రు
వినయ హీనమైన విద్యలు విద్యలా ?
మహిని నీతి బాట మర్తి మాట

69.నేటి సినిమాలందు మేటినటులు  లేరు
కథల తీరు చూడ కలుగు భాధ
హాస్య నటులె  నేటి నాయకుల్ చూడంగ
మహిని నీతి బాట మర్తి మాట

70.జంకు గొంకులు మాని "జంకుఫుడ్డు"  తినెడి
షోకు లేళ్ళ చదువు "షాకు" పాలు
షోకు లెక్కువయ్యు,పోయెను చదువులు
మహిని నీతి బాట మర్తి మాట

71.నేటి కుర్రకారు మేటి సినీ తారన్
పగటి కలలు కనుచు"ప్యాసు"కారు
తలలు బోడులైన   తలపులు బోడులా?
మహిని నీతి బాట మర్తి మాట

72.నేటి బాల మణులు  హీరోయినుల వలె
"జీరో"సైజు కొరకు పీకులాట
"షే పు"మారినంత "ఫేటులు "  మారునా?
మహిని నీతి బాట మర్తి మాట

73.చేయు పనులు నేటి యువకులు చెప్పరు
చెప్పినట్లు వారు చేయబోరు
నేటి యువత హోరు గాలిలో దీపాలు
మహిని నీతి బాట మర్తి మాట

74.భ్రాత"బ్రదర్",మాత "మదర్" అయ్యెనాంగ్లాన
తల్లి బాష సంస్కృతంబు నిజము
దోచుకోనిరి దొరలు దొరికినదంతయున్
మహిని నీతి బాట మర్తి మాట

75. ఒడలు దాచుకొనుట యొకనాటి సంస్కృతి
బట్ట బయలు సేత నేటి ప్రగతి
బట్ట నిండుగ గట్ట నేడనాగరికంబాయె!
మహిని నీతి బాట మర్తి మాట

76.వర్ధమాన తార వలువకు వెలగట్టు
పేరు పడ్డ తార రేటు పెంచు
పేరు గూడ పోయె  పట్టు పుట్టములకు
మహిని నీతి బాట మర్తి మాట

77.వర్ధమాన తార వలువలు కాల్రాసె
పేరు పడ్డ తార విలువ లొగ్గె
అర్ధనగ్నమయ్యెను అర్ధనారీత్వంబు
మహిని నీతి బాట మర్తి మాట

78.చీర కట్టుకన్న చిగురు బోణియ మిన్న
చిగురు బోణి కన్న చీర కట్టు
సిగ్గులేని "గళ్ళ సిల్కులు" నేడయా
మహిని నీతి బాట మర్తి మాట

79.లేమ కనులు కలువ పూవుల బోలును
కురులు  నీల గిరుల కూట మగును
ఉవిదలయంద మిట్లు "ఉపమల" పాలయ్యె 
మహిని నీతి బాట మర్తి మాట 

                                  రాజకీయాలు

80.అలమటింత్రు జనులు, పాలకులర్ధాతు
రులయు ధనము దోచుకొన్నయెడల
తల్లి చేను మేయ తా పిల్ల గట్టునా?
మహిని నీతి బాట మర్తి మాట 

81 తొమ్మిదేడులుండి  తొండంబు జూపించె
నన్న దాతలపుడు "ధర్నా" చేయ
గన్ను తోడ బాబు తన దమ్ము చూపెరా
మహిని నీతి బాట మర్తి మాట                                                                                              
82.సాగే దేశమందు సద్భావన యాత్ర
చేష్టలుడిగి నంత చైతన్య రధము
పేరు లేక యాత్రలు పాద యాత్రలు కావొ?
మహిని నీతి బాట మర్తి మాట













83.పదవి కొరకు నేత ప్రామాణికములాడు
పాదయాత్ర మీద పాదముంచి
పరువు గూడ బోయె గణతంత్ర మీవిధి
మహిని నీతి బాట మర్తి మాట

84.లేని వాళ్ళ కొరకు లెక్కకు మించిన
పథకములను చూపి పంచు కొంద్రు
పథ కరచన లెట్లు ప్రజలకు మేలౌను?
మహిని నీతి బాట మర్తి మాట

85.రాజు మంత్రియయ్యే రైతు కామందాయె
పార దర్శకంబు పాపమాయె
గతులు తప్పె నేడు గణతంత్ర మీరీతి
మహిని నీతి బాట మర్తి మాట  
 
86.పెట్ట బోవు పార్టీ పెనుముప్పనుచునెంచి
నేత నుంచె జైలు కేసులు బనాయించి
పెట్ట బోవు "పాదు" కొనబోవు "బర్రెలా"
మహిని నీతి బాట మర్తి మాట

87.ప్రజల కొల్లగొట్టు ప్రభువున ,కిహమందె
సంభవించు కీడు చట్ట రీతి
రాజద్రోహి కన్న ప్రజల ద్రోహియె  మిన్న
మహిని నీతి బాట మర్తి మాట

88.దారి తెన్నులేదు దరిదాపు పని లేదు
"మాజి" నేతకే పడును మరల వోట్లు
యెన్నికలల వేళ ఏమౌనొ? బుద్ధులు
మహిని నీతి బాట మర్తి మాట

89.అన్నదాతలపుడు గన్నుకు బలియైరి
రైతు చేతిలోన చేయి కలిపి   నేడు
పాద యత్రలంటు రాజకీయ యాగీలు
మహిని నీతి బాట మర్తి మాట

90ప్రతిన లాడువారు ప్రజల నేతలుగారు
"మీడియాలు"నేడు "మిడిలు మెన్లు"
పాదయాత్రలిట్లు   పరిహాస మాయెరా!
మహిని నీతి బాట మర్తి మాట 
  
91.దొంగ పనులు జేసి దొరికిన దంతయు
మెక్కు వాడె నేటి మేటి నేత
ప్రజల దొంగను బట్ట పరమేశు వశమౌనె?
మహిని నీతి బాట మర్తి మాట

92.రెండు కుర్చీలందు ఒకసారే కూర్చొను
వాడెవడును లేడు వసుధలోన
తరతరాల తూగు ధనమేల దాచునో?
మహిని నీతి బాట మర్తి మాట

93."వోటుబ్యాంకు”రాజకీయముల వలన
దేశ ప్రగతికిపుడు చేటు మూడె
సబ్సిడీలు వచ్చి సాంతము చెడిపోయె 
మహిని నీతి బాట మర్తి మాట

                                      వాతావరణము-కాలుష్యము

94 భూమి సంపదలను భూరిగ వాడకు
వలయు దాని కన్నవాడువారు
దొంగలనుట కన్న దోపిడీ దారులే 
మహిని నీతి బాట మర్తి మాట

95.ఉన్నవి  వనరులని పొదుపు మరువ రాదు
కల్గిన వనరులను కాంచ వలయు
లేని యెడల "భావి" ఎండమావిగ మారు
మహిని నీతి బాట మర్తి మాట

96 పూర్వ కాలమందు పురుగులు,పక్షులు ,
వివిధ జీవులండి విలసిల్లె
జీవ విధము తప్పె జీవరాశులు పోవ
మహిని నీతి బాట మర్తి మాట

97.ఇంట, బయట ,చుట్టు  పెంట పోగులు పెట్టి
గాలి,నీరు,ధ్వనులు కలుషములుగ
చేయువారు ఖలులు ,నీచులు,దోషులు
మహిని నీతి బాట మర్తి మాట     

                                              మాతృబాష

98.తెలుగు నేల బుట్టి తెలుగు గాలిని పీల్చి
తెలుగు మాటలాడ తెగులదేల?
అమ్మనోట నాడ  యవమాన మేలయా?
మహిని నీతి బాట మర్తి మాట

99.మాత్రు  బాషలోని మకరంద మధురిమ
 కాంచనగునె  వేరె  బాష లందు ?
తల్లి బాష కన్న కమనీయ మేదిరా!
మహిని నీతి బాట మర్తి మాట

                                                 కలగూర గంప

100.మదము మచ్చ రంబు  మనలోని కామంబు
వయసు మీరి నంత నణగ వలయు
మనిషి జీవన తీరు వయసుతో ముడివడు
మహిని నీతి బాట మర్తి మాట

101.పలమ నేరు దాటి పలుపాట్లు  పడినను
చింత లేని చోటు చిక్కలేదు
చిత్తము స్థిరమైన చిద్విలాసంబగు
మహిని నీతి బాట మర్తి మాట

102.తనకు బాధ కల్గు పనులేమి యైనను
ఎదుటి వారికెపుడు చేయరాదు
విదుర నీతి ధర్మ మిదియేను నరయంగ
మహిని నీతి బాట మర్తి మాట

103.సహజ పండితుoడు బమ్మెర పోతన్న
హలము చేత బట్టి హరుని పొంది
క్రుమ్మరించెను సుధగ కూర్మి భాగవతంబు
మహిని నీతి బాట మర్తి మాట 

104.హరుని కృ ప ను  బడసి బమ్మెర పోతన్న
భాగవతము  జేసి బడసె పేరు
హరుని కృతము నరునకే విధముగ వచ్చు?
మహిని నీతి బాట మర్తి మాట

105.కాంత కనకములను జార నీకెప్పుడు
జారి నంత ఇంద్ర  జాలమగును
రెంటి వలన గాదె రెడ్డిరాజులు పోయిరి
మహిని నీతి బాట మర్తి మాట 

106.రాజు గారి పెద్ద రాణిని పొగిడిన
చిన్న రాణి గూర్చి చెప్పినట్లె
తెగడు  మాటకన్న పొగడు మాటయె చెట్ట
మహిని నీతి బాట మర్తి మాట

107.మూడు పదులు దాట ముదుసలౌ వెలయాల
వేశ్యమాత రూపు దెచ్చుకొనును
తార్చబడినదపుడు తార్చును తానిప్డు 
మహిని నీతి బాట మర్తి మాట

108.కోతులన్నికలిసి కోవెలలో చేరి
కొత్తరాతి బండ కొలిచి మురిసె
అనుకరించినంత అందునా  నాకంబు?
మహిని నీతి బాట మర్తి మాట
  
109.వల్లకాడు లోను వర్ణ భేదము పోదు
కులము కులము కొక్క రుధ్ర  భూమి
కలదె?కులము కంటు కడదేర ప్రాణంబు
మహిని నీతి బాట మర్తి మాట

110.వసుధ చక్కనైన వనరులున్న నగరి
నాది కాదు నీది కాదు "మనది"
వసుధ"మాత" మనకు ,వధియించి చీల్చకు
మహిని నీతి బాట మర్తి మాట


111.సుందరమగు ప్రక్రుతి సృజనంబు గావించి
నడుమ ప్రాణికోటి నరుని జేసె
ప్రాణదాతవు కావు ప్రాణంతకుడవు  కాకు
మహిని నీతి బాట మర్తి మాట